శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

10 నెలల బాలికకు రైల్వే ఉద్యోగం - ఎలా?

baby - job
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్‌పూర్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ఆగ్నేయ మధ్య రైల్వేలో చాలా చాలా అరుదైన కారుణ్య ఉద్యోగ నియామకం జరిగింది. కేవలం పదంటే పది నెలల చిన్నారికి రైల్వే శాఖ ఉద్యోగం ఇచ్చింది. ఈ బాలిక పేరు రాధిక. ఈమెకు బుధవారం రైల్వే అధికారులు ఉద్యోగం ఇచ్చారు. ఈ ఉద్యోగ రిజిస్ట్రేషన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంతకీ పది నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం ఇవ్వడం ఏంటనే కదా మీ సందేహం... అయితే, ఆ వివరాలు ఇవిగో... 
 
ఆగ్నేయ మధ్య రైల్వేలో ఉద్యోగిగా రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ పని చేస్తూ వచ్చారు. జూన్ నెల ఒకటో తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి భిలాయ్ వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర కుమార్ యాదవ్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయింది. కానీ, ఈ ఘోర ప్రమాదం నుంచి పది నెలల చిన్నారి సురక్షితంగా బయటపడింది. 
 
ఆ చిన్నారి వయసు 10 నెలలు మాత్రమే. ఆమె తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇచ్చారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇందుకు పాప వేలిముద్రలు తీసుకున్నారు. ఆ బాలికకు 18 యేళ్లు నిండిన తర్వాత రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది. ఆగ్నేయ చరిత్రలో ఇంత చిన్న వయసు వారికి ఉద్యోగం ఇవ్వడం ఇతే ప్రథమమని రైల్వే అధికారులు వెల్లడించారు.