శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మే 2020 (18:15 IST)

గ్యాస్ లీకేజీ బాధితుల ఆర్థిక సాయం : రూ.30 కోట్లు విడుదల

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువు లీకై మృతి చెందిన బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించేందుకు ఏపీ సర్కారు రూ.30 కోట్లను తక్షణం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ మొత్తంలో చనిపోయి వారి 11మంది కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇస్తారు. అలాగే, వెంటిలేటరుపై చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 వేలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నారు. 
 
కాగా, విశాఖ బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం విశాఖలో మాట్లాడుతూ, 'వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న బాధితులకు 10 లక్షల రూపాయలు చొప్పున ఇస్తాం. అస్వస్థతకు గురై రెండు, మూడు రోజులపాటు చికిత్స పొందిన వారికి లక్ష రూపాయలు చొప్పున అందిస్తాం. ప్రాథమిక చికిత్స అవసరమైన వారికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తాం. విష వాయువు బారినపడిన ఐదు గ్రామాలకు చెందిన 15 వేల మందికి పది వేల రూపాయల చొప్పున సాయం చేస్తాం' అని ప్రకటించారు. ఇందులోభాగంగా రూ.30 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 
 
మరోవైపు, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాద ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన హై పవర్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. హై పవర్ కమిటీలో నలుగురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారని ప్రభుత్వం తెలిపింది. ప్రమాదం వెనుక కారణాలు, ప్రమాదానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు పాటించారు అనే అంశంపై విచారణ చేపట్టనున్నారు. 
 
సిబ్బంది ఎటువంటి సేఫ్టీ నిబంధనలను పాటించారు అనే అంశాలపై హై పవర్ కమిటీ విచారణ చేపట్టనుంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంపై నెల రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హై పవర్ కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. హై పవర్ కమిటీలో ఐఏఎస్ లు నీరబ్ కూమార్, కరికల్ వలవన్, వినయ్ చంద్, వివేక్ యాదవ్ లతో పాటు ఐపీఎస్ అధికారి ఆర్.కే మీనాను సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది.