బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 11 నవంబరు 2021 (15:10 IST)

అమరావతి రైతుల మహాపాద యాత్రను అణచివేసేందుకు జగన్ రెడ్డి కుట్ర

రాష్ట్రానికి ఏకైక ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ, అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజల నుంచి వస్తున్న విశేషమైన స్పందనను చూసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు.
 
 
ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన యాత్రకు లక్షలాది మంది ప్రజలు తమ సంఘీభావాన్ని తెలుపుతుంటే,  ప్రభుత్వం మాత్రం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తోంద‌ని ఆరోపించారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై, మీడియా ప్రతినిధులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గం అన్నారు. జగన్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని, ప్రభుత్వ దమనకాండకు ఈ సంఘటన అద్దం పడుతోంద‌న్నారు. 13 జిల్లాల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అమరావతి నిర్మాణాన్ని నిలిపివేస్తూ, 3 రాజధానులంటూ విధ్వంసకర రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.
 
 
ప్రజా మద్దతుతో సాగుతున్న మహాపాద యాత్రను అణచివేయాలనే కుట్రతో పోలీసులను అడ్డుపెట్టుకుని అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని అన్నారు. మొదటి రోజు నుంచీ మహా పాద యాత్రకు ఆటంకాలు కల్పిస్తూనే ఉన్నార‌ని, రైతుల పాదయాత్రకు మద్దతుగా వస్తున్న ప్రజలను రానివ్వకుండా రోడ్లు దిగ్బంధించి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు నిదర్శనం అని అన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను జరుపుకోనివ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నార‌ని, హైకోర్టు ఆదేశాల ప్రకారం మహాపాద యాత్రను కొనసాగిస్తున్న అమరావతి రైతులను అడ్డుకోవడం మానుకోవాల‌ని సూచించారు. పాదయాత్రలో గాయపడిన రైతులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు డిమాండు చేశారు.