బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - ఏపీకి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైవుంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఈ తీవ్ర అల్పపీడనం ఏర్పడివున్నట్టు పేర్కొన్నారు.
ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ గురువారం వాయుగుండంగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆ తర్వాత 48 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశముందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాయుగుండం ప్రభావం కారణంగా గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని పేర్కొన్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ సూచించింది. మలక్కా జలసంధి, ఇండోనేషియాను ఆనుకుని ఉన్న సెన్యార్ తుపాను తీరం దాటిందని వెల్లడించింది.