శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 12 నవంబరు 2021 (17:29 IST)

భారీ వర్షాలతో ప్రభుత్వం అలర్ట్... బుగ్గవంక వాసులు భ‌య‌ప‌డొద్దు

భారీ వర్షాలపై క‌డ‌ప జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. బుగ్గవంక వరద ఉదృతిపై.. నగర ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలయిన 30, 31, 39, 40, 41, 44వ డివిజన్ల పరిధిలోని బుగ్గవంక పరివాహ ప్రాంతాలతో పాటు, బుగ్గవంక లైనింగ్ వాల్ గ్యాపులను ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. 
 
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టం పూర్తి స్థాయిలో పెరిగిందని.. వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయన్నారు. కడప నగరానికి చేరువలో ఉన్న బుగ్గవంక జలాశయంలో వరదనీటి ఇన్ ఫ్లో 3000 క్యూసెక్కుల నుండి 4000 క్యూసెక్కులు పెరుగుతుండడంతో.. ఇరిగేషన్ అధికారులు.. గేట్లను ఎత్తి.. లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని వదలడం జరుగుతోందన్నారు. దీంతో.. బుగ్గవంక పరివాహ ప్రాంతాలు, లోతట్టు నివాస ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. 
 
 
ప్రస్తుతం బుగ్గవంక పరిస్థితి ప్రమాదకరంగా లేదని.. లోతట్టు ప్రాంత ప్రజలు భయపడాల్సిన పని లేదన్నారు. మరో రెండు రోజుల పాటు అధిక వర్షాలు కారణంగా.. వరద నీరు పెరిగే అవకాశం ఉండడం చేత ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతోందన్నారు. వర్షం నిరంతరాయంగా కురుస్తుండటంతో.. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. విఫత్తుల నిర్వహణ, రెస్క్యు టీమ్ సిబ్బంది సహాయంతో.. తెప్పలు, గాలి ట్యూబులు, మరబోట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
 
 
ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయిందని.. అవసరమైతే అన్ని రకాల వరద సహాయక చర్యలను చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు.  జిల్లా కేంద్రంతో పాటు. రెవెన్యూ డివిజన్ కేంద్రల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడమైనదన్నారు. బుగ్గ వంక తీరం వెంబడి  ఉన్న రక్షణ గోడకు కొన్ని చోట్ల  నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండడం వల్ల లోతట్టు నివాసంలోకి నీరు చేరకుండా.. ఆ గ్యాపులకు తాత్కాలిక రక్షణగా ఇసుక మూటలు, గ్రావెల్ వేయించడం జరిగిందన్నారు. 

 
బుగ్గవంక లైనింగ్ పనుల నిర్మాణానికి.. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది 1.2 కి.మీ.ల లైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.50 కోట్లు నిధులు కేటాయించిందన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్థికాకపోవడంతో పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. త్వరలో ఆ సమస్య కూడా తీరుతుందన్నారు. అంతేకాకుండా లోతట్టు నివాస ప్రాంత ప్రజలు చిన్న పిల్లలను నీటి ప్రవహాలను సందర్శించేందుకు  వెళ్లనీయకుండా జాగ్రత్త వహించాలని.. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.