బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (12:51 IST)

ఉపాధి దొరుకుతుందని వస్తే గొడ్డు చాకిరి చేయిస్తున్నారు... డ్రైవర్ల ఆవేదన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన పథకం ఇంటి గడపకు రేషన్ సరకుల డెలివరీ. ఈ పథకాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలను కూడా ప్రభుత్వం సమకూర్చారు. ఈ రేషన్ సరుకులు రవాణా చేసే వాహనాల డ్రైవర్లు ఇపుడు చేతులెత్తేస్తున్నారు. 
 
ప్రభుత్వం ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు ఏమాత్రం పొంతనలేదని వారు వాపోతున్నారు. తమకు ఈ అవకాశం అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ పనికి బదులు సమోసాలు, మొక్కజొన్న పొత్తులు అమ్ముకోవడం మేలని తెగేసిచెబుతున్నారు. ఏదో ఉపాధి దొరుకుతుందని అనుకున్నామని.. ఇలా గొడ్డుచాకిరి చేయాల్సి వస్తుందని తెలియదని రేషన్ వాహనాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
'ఈ వాహనాలను మేము నడపలేం బాబోయ్.. ఈ కష్టాలను మేం భరించలేం స్వామీ' అంటూ ఆయాశపడుతున్నారు. రేషన్ వాహనాల డ్రైవర్లు, ఫోన్‌లో చేసిన సంభాషణలు ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పని మేం చేయలేమంటూ సన్నిహితులవద్ద గోడు వెళ్లబోసుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
 
కర్నూల్‌లోని సివిల్ సప్లయ్ కార్యాలయం ఎదుట రేషన్ వాహనాల డ్రైవర్లు ఆందోళన చేశారు. ఇంటర్వ్యూలో ట్రక్ డ్రైవర్లుగా ఎంపిక చేసి.. తర్వాత లేబర్ వర్క్ కూడా చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాస్ కూడా తమనే చేయమంటున్నారని.. ఇది మరీ దారుణమని అంటున్నారు. తాము డిపాజిట్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తే.. వాహనాలు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు.