బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (16:29 IST)

టీడీపీ కార్యాలయం వద్ద మ‌ళ్ళీ ఉద్రిక్తత... మూవ్... మూవ్ అంటూ లోకేష్!

ఏపీలో రాజ‌కీయ కొట్లాట‌లు శృతి మించుతున్నాయి. నిన్న మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేయ‌గా, నేడు మ‌ళ్ళీ అదే కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఒక ద‌శ‌లో టీడీపీ జాతీయ కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోలీసులపై విరుచుకుప‌డ్డారు. టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జ‌రిగింది. నిన్నటి దాడిలో గాయపడిన కార్యకర్తలు కార్యాలయానికి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తల అంబులెన్స్ ని అడ్డుకున్న పోలీసులు వారిని కార్యాల‌యానికి రానివ్వ‌లేదు. త‌మ‌కు అయిన గాయాలు చూపించేందుకు పార్టీ కార్యాలయానికి వస్తుండగా అడ్డగించారు. 
 
పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై ర్యాలీగా వెళ్లిన లోకేశ్, టీడీపీ నేతలు ప్ర‌భుత్వ వ్య‌తిరేక నినాదాలు చేశారు. దీనితో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లోకేష్ ఒక ద‌శ‌లో పోలీస్ అధికారుల‌పై విరుచుకుప‌డ్డారు. త‌ప్పుకో... అడ్డులే... ఏం త‌మాషాలా అంటూ, పోలీసుల‌పై దూసుకెళ్ళారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల అంబులెన్స్ ను పోలీసుల దిగ్బంధం నుంచి విడిపించారు.