శుక్రవారం, 19 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (14:00 IST)

బాలీవుడ్ నటితో ఆర్యన్ డ్రగ్స్ చాట్ : కోర్టుకు ఎన్సీబీ

ముంబై క్రూయిజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో బాలీవుడ్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలను ఎన్సీబీ సేకరించింది. ముఖ్యంగా, ఓ యువ నటితో ఆర్యన్ ఖాన్ జరిపిన డ్రగ్స్ చాటింగ్‌కు సంబంధించిన వివరాలను కోర్టుకు ఎన్సీబీ అధికారులు సమర్పించారు. దీంతో ఆయనకు ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. 
 
ప్రస్తుతం అతడు ఆర్థర్‌ రోడ్‌ జైలులో వుంటున్న ఆర్యన్... ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించనుంది. ఇదిలావుంటే, ఓ బాలీవుడ్‌ నటితో ఆర్యన్‌ డ్రగ్స్‌ గురించి చాటింగ్‌ చేసినట్లు ఎన్‌సీబీ దర్యాప్తులో గుర్తించింది. అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. 
 
అంతేగాక, డ్రగ్స్‌ విక్రేతలతో ఆర్యన్‌ చాటింగ్‌ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వాట్సాప్‌ చాట్‌లను ఎన్‌సీబీ నేడు కోర్టుకు సమర్పించింది. డ్రగ్స్‌ విక్రేతలకు అతడు రెగ్యులర్ కస్టమర్‌ అని తమ దర్యాప్తులో తేలినట్లు ఎన్‌సీబీ వెల్లడించింది. ఆర్యన్ బెయిల్‌పై కోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో ఎన్‌సీబీ ఈ నివేదిక సమర్పించడం గమనార్హం. 
 
ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు కోర్టు తీర్పు వెలువరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అతడి బెయిల్‌ను కోర్టు ఇప్పటికే రెండు సార్లు తిరస్కరించింది.