సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 అక్టోబరు 2021 (17:06 IST)

రేవ్ పార్టీలో షారూక్ కొడుకు ... క్రూజ్ షిప్‌లో ఎవరెవరు ఉన్నారంటే...

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ చిక్కుల్లో ప‌డ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్‌లో జ‌రిగిన రేవ్ పార్టీలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతని వద్ద ఆరా తీస్తుంది. 
 
శ‌నివారం రాత్రి ఈ క్రూజ్ షిప్‌లో జ‌రుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి కేసు న‌మోదు కాలేదు. అత‌న్ని అరెస్ట్ కూడా చేయ‌లేద‌ని ఎన్సీబీ జోన‌ల్ డైరెక్ట‌ర్ స‌మీర్ వాంఖెడె వెల్ల‌డించారు. 
 
అయితే, ఆర్య‌న్ ఖాన్ ఫోన్‌ను ఎన్సీబీ సీజ్ చేసింది. అత‌డు డ్ర‌గ్స్ తీసుకున్నాడా లేక అత‌ని ద‌గ్గ‌ర ఏవైనా డ్ర‌గ్స్ ఉన్నాయా అన్న కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు. 
 
మరోవైపు, ఈ క్రూజ్ పార్టీ ప్లాన్ చేసిన ఆరుగురు ఆర్గ‌నైజ‌ర్ల‌కు కూడా ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసింది. ఈ రేవ్ పార్టీలో ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కాషిఫ్ ఖాన్ హ‌స్తం కూడా ఉండ‌టంతో ఆయ‌న‌ను కూడా ఎన్సీబీ ప్ర‌శ్నిస్తోంది. 
 
ఆర్య‌న్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పెద్ద కొడుకు. ఆర్య‌న్‌తోపాటు ఈ రేవ్ పార్టీలో ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ల కూతుళ్లు కూడా ఉన్న‌ట్లు ఎన్సీబీ గుర్తించింది.
 
క్రూజ్ షిప్‌పై దాడి చేసి అక్క‌డి నుంచి ఎక్స్‌ట‌సీ, కొకైన్‌, మెఫిడ్రోన్‌, చ‌ర‌స్‌లాంటి డ్ర‌గ్స్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ఎన్సీబీ వెల్ల‌డించింది. ఈ దాడుల సంద‌ర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకుంది. అందులో ఇద్ద‌రు మ‌హిళ‌లు కూడా ఉన్నారు. 
 
ఖచ్చిత‌మైన స‌మాచారంతోనే కార్డెలియా అనే ఈ క్రూజ్ షిప్‌పై దాడి చేసిన‌ట్లు ఎన్సీబీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ క్రూజ్ ముంబై నుంచి గోవా వెళ్తోంది. త‌మ క్రూజ్‌లో ప్ర‌యాణిస్తున్న వాళ్ల ద‌గ్గ‌ర నుంచి నార్కోటిక్స్ అధికారులు డ్ర‌గ్స్ స్వాధీనం చేసుకున్న‌ట్లు ఈ క్రూజ్ ప్రెసిడెంట్‌, సీఈవో జుర్గెన్ బైలోమ్ తెలిపారు.
 
శ‌నివారం రాత్రి బాలీవుడ్‌, ఫ్యాష‌న్‌, బిజినెస్ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌ల‌తో ఈ క్రూజ్ షిప్ మూడు రోజుల ప్ర‌యాణానికి బ‌య‌లు దేరింది. అయితే ఈ క్రూజ్ షిప్‌లో డ్ర‌గ్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుకున్న ఎన్సీబీ.. ప‌క్కా ప్రణాళిక‌తో దాడి చేసింది. ముంబై తీరం దాడి స‌ముద్రం మ‌ధ్య‌లోకి వెళ్ల‌గానే క్రూజ్‌లో రేవ్ పార్టీ ప్రారంభ‌మైంది.