గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (20:51 IST)

ఆర్టీసీ బస్సెక్కిన నారా లోకేష్.. వైకాపాపై ఫైర్

Nara lokesh
Nara lokesh
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ప్రస్తుతం సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా పిచ్చాటూరులో లోకేష్ ఆర్టీసీ బస్సు ఎక్కారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు.. వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. 
 
ఛార్జీలు పెంచి విపరీతంగా భారం పెంచారని ప్రయాణికులు లోకేష్‌తో చెప్పారు. వైకాపా సర్కారు ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసి ఛార్జీలను మూడు సార్లు పెంచిందన్నారు.
 
ప్రభుత్వం విలీనం తర్వాత ఆర్టీసీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేసిన లోకేష్, కండక్టర్‌ను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 
ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఛార్జీలను మూడు రెట్లు పెంచడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన లోకేష్.. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
 
అంతకముందు లోకేష్ ఎస్సీ సామాజికవర్గం ప్రతినిధులతో సమావేశమైనారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని ఫైర్ అయ్యారు. ఇంకా కార్పొరేషన్ లోన్‌లు రావట్లేదన్నారు. 300 యూనిట్ల విద్యుత్ ఉచితం అన్నారని.. ఉచిత విద్యుత్ మాట దేవుడెరుగు విద్యుత్ బిల్లులు కట్టాలని వేధిస్తున్నారన్నారు.