సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (11:29 IST)

వైకాపాకు మరో గట్టి షాక్... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి!!?

vemireddy prabhakar reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఆయన ఉన్నట్టుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శనివారం మధ్యాహ్నం ఉన్నఫళాన నెల్లూరు నుంచి పయనమయ్యారు. కొద్దిరోజులపాటు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని అనుచరులకు, సిబ్బందికి సూచనలిచ్చారు. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు వైకాపా వర్గాల నుంచి వినిపిస్తోంది. తాను కొన్ని రోజులపాటు ఎవరినీ కలవబోనని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దీంతోపాటు ఆయన ఫోనుకు అందుబాటులో లేరని ప్రచారమవుతోంది. 
 
ఈసారి నెల్లూరు వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఆయనను అధిష్ఠానం ప్రకటించింది. తన పరిధిలో వచ్చే మూడు శాసనసభ నియోజకవర్గాల బరిలో అభ్యర్థులను మార్చాలని ఆయన తొలి నుంచి పట్టుబడుతున్నారు. దీనిపై అధిష్టానం స్పందించకపోవడంతో కొన్ని రోజులనుంచి అసంతృప్తితో ఉంటున్నారు. అనంతరం మళ్లీ చురుగ్గా వ్యవహరించిన ఆయన.. నెల్లూరు నగర అసెంబ్లీ పార్టీ టికెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు రాకుండా చేసి పంతం నెగ్గించుకున్నారు. ఆయన స్థానంలో తన భార్య వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి అవకాశం కల్పించాలని కోరారు. 
 
ముస్లిం మైనారిటీలకు ఇవ్వదలిస్తే మదీనా వాచ్ కంపెనీ అధినేత ఇంతియాజ్‌కు కేటాయించాలని ప్రతిపాదించినట్లు సమాచారం. వైకాపా అధిష్ఠానం ఇవేమీ పట్టించుకోకుండా అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు, నగర డిప్యూటీ మేయర్ ఎండీ ఖలీల్‌ను పార్టీ సమన్వయకర్తగా ప్రకటించింది. ఇది వేమిరెడ్డిని తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. సమన్వయకర్త ప్రకటనపై కనీస సమాచారం ఇవ్వలేదని వేమిరెడ్డి అలకబూనారు. తనకు పార్టీలో జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారే కానీ ఆ గౌరవం దక్కడం లేదని వేమిరెడ్డి తన అనుచరుల ఎదుట వాపోయినట్లు సమాచారం. ఈ రాజకీయాలు తనకు సరిపోవని, ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు అత్యంత సన్నిహితులతో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం.