1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (09:38 IST)

భయం గుప్పెట్లో దేశం.. గుంటూరూలో ఎటు చూసినా చితి మంటలే..

కరోనా వైరస్ దెబ్బకు దేశం భయం గుప్పెట్లో ఉంది. ఈ వైరస్ ధాటికి ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. ప్రతి రోజూ మూడు లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. మృతుల సంఖ్య కూడా రెండు వేలు దాటిపోయాయి. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 
 
కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. దీంతో అధికారులు చేతులేత్తేస్తున్నారు. కరోనా లక్షణాలతో వస్తున్నవారందరికి పరీక్షలు చెయ్యడం అధికారుల వల్లకావడం లేదు. 
 
ఎప్పుడు ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో శ్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి.
 
కరోనా మృత్యుకేకలు రాష్ట్రంలోని శ్మశానవాటికల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బొంగరాలబీడు శ్మశానవాటిక బుధవారం ఈ వాటికను సందర్శించినవారికి ఎక్కడంటే అక్కడ తగలబడుతున్న చితులు కనిపించాయి. వాటిలో ఎక్కువగా కరోనా మృతదేహాలే ఉండటం కలవరపెడుతోంది. 
 
మంగళవారం ఈ శ్మశానవాటికలో 51 శవాలకు దహన సంస్కారాలు జరిగాయి. గత నాలుగు రోజుల వ్యవధిలో వందకుపై అంత్యక్రియలు జరిగాయి. సాధారణ రోజుల్లో ఈ శ్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. 
 
కానీ, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ఈ నెల 18న 26 మృతదేహాలు,19న 23 మృతదేహాలకు, ఈనెల 20 మంగళవారం రోజున 40, బుధవారం 52 మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు. మొత్తంగా గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అందులో 35 మంది కరోనాతో మృతి చెందినవారే.
 
అలాగే, గుంటూరు నగరంలోనే ఉన్న కొరిటపాడు శ్మశానవాటిక సైతం శవాల గుట్టలతో నిండిపోయింది. ఇక్కడ ఈ నాలుగురోజుల్లో 50కు పైగా కరోనా మృతదేహాలకు దహన సంస్కారాలు జరిగాయి. అదేవిధంగా స్తంభాలగరువులోని శ్మశానవాటికకూ తాకిడి ఎక్కువగానే ఉంటోంది. ఇక్కడ 20 వరకు కరోనా మృతదేహాలకు గత నాలుగు రోజుల్లో అంతిమ సంస్కారాలు జరిగాయి.