ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 4 నవంబరు 2022 (17:37 IST)

పరిషత్తు ఓటరు నమోదుకు నవంబరు 23 నుండి డిసెంబరు 9 వరకు అవకాశం: ఏపీ ఈసీ ముఖేష్ కుమార్ మీనా

Mukesh kumar Meena
రాష్ట్రంలో జరగనున్న శాసన పరిషత్తు ఎన్నికల ఓటరు నమోదుకు తొలివిడతలో నవంబరు ఏడు చివరి తేదీ కాగా, మలి విడతలో నవంబరు 23 నుండి డిసెంబరు 9 వరకు సైతం దరఖాస్తులు స్వీకరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొన్ని మాధ్యమాలలో ప్రచారం జరుగుతున్నట్లు నవంబరు ఏడు చివరి తేదీ కాదని స్ఫష్టం చేసారు. ఇప్పటికే కమిషన్ ఆమోదించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 23 నుండి డిసెంబరు 9 వరకు అభ్యంతరాలను దాఖలు చేసే సమయంలో, ఫారం-18, 19ని సమర్పించడం ద్వారా దరఖాస్తుదారు ఒటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని మీనా పేర్కొన్నారు.
 
పరిషత్తు ఎన్నికలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలలో నమోదు పురోగతి, రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు సంసిద్ధత తదితర అంశాలను సమీక్షించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అసెంబ్లీ, శానన పరిషత్తు నియోజకవర్గాల ఓటరు రిజిస్ట్రేషన్ అధికారులతో ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే దృశ్య శ్రవణ మాధ్యమ సదస్సును నిర్వహించారు.
 
ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తులో శ్రీకాకుళం- విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రులు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు, కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రులు & ఉపాధ్యాయులు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల జాబితా తయారీ ప్రక్రియ జరుగుతోందని తొలి విడత దరఖాస్తుల స్వీకరణ తేదీ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబరు 23న ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు.