ఇక డ్రోన్ రాజకీయాలు ఆపండి... ప్రజల్ని వరదలో వదిలేసి ఏంటి? పవన్ కల్యాణ్ ఫైర్...
కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే, వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయం. వరద ఉధృతి ఉన్నప్పుడు లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడటం ప్రభుత్వం విధి. కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా లేదా అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటమా మంత్రుల బాధ్యత.
కరకట్ట మీద ఉన్న మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారు రెండు రోజులపాటు బస చేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు గారి గృహం, అదే వరుసలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసంతో పాటు ప్రముఖుల ఇళ్ళు, శ్రీ శారద పీఠం కార్యక్రమం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళిన ఆశ్రమం ఉన్నాయి. వరద ఉధృతి పెరిగితే అన్నీ మునుగుతాయి. డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు.
ముందుగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను కాపాడి, వారికి కావల్సిన అన్ని రకాల సహాయాలు చేయండి. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా అని ప్రతిపక్షం, మునిగిందా లేదా అని చూసేందుకు అధికార పక్షం వాళ్లు వెళ్ళి రాజకీయాలు చేస్తూ బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారు. రాజకీయాలు, కక్ష సాధింపులు ఏవైనా ఉంటే తరవాత చేసుకోండి. ఇది విపత్కాలం.
వరద బాధల్లో ఉన్న పేదలను కాపాడండి.
151 సీట్లు వచ్చిన అధికార పార్టీ ప్రజల పట్ల బాధ్యతతో సుపరిపాలన అందించాలి. విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదు. జనసేన ఎప్పుడూ రాజకీయాల్లో హుందాతనం పాటించాలనే కోరుకొంటుంది. జగన్ రెడ్డి గారిపై విమానాశ్రయంలో దాడి జరిగినప్పుడు ఆయనకు ప్రభుత్వం తగిన భద్రత ఇవ్వాలని జనసేన స్పష్టంగా చెప్పింది.
నాటి పాలకపక్ష నేతలు ఆ దాడి జగన్ రెడ్డి గారి తల్లి చేయించారని ఆరోపణలు చేస్తే - ఆ విధంగా మాట్లాడటం సరికాదని తప్పుబట్టి, ఏ కన్న తల్లీ తన బిడ్డను చంపించుకోవాలి అని చూడదని, అలాంటి కువిమర్శలు తగవని చెప్పాను. వరద వేళ సాయం చేరడం లేదని ప్రజలు వాపోతున్నారు. రాజకీయాలు కొద్దిరోజులు పక్కనపెట్టి ముంపు బాధిత ప్రాంత ప్రజలకు, రైతులకు సహాయం చేయండని పవన్ కళ్యాణ్ హితవు పలికారు.