మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:36 IST)

ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలి... టీడీపీ కంటే వైకాపానే ఎక్కువ గౌరవం ఇచ్చింది...

vallabhaneni vamsi
విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటికీ పేరు మార్చడం సబబు కాదని, ఆ విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని వైకాపా చెంత చేరిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చుతూ బుధవారం ఏపీ అసెంబ్లీలో ఓ బిల్లును ఆమోదించారు. దీన్ని వల్లభనేని వంశీ తప్పుబట్టారు.
 
ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని ఆయన కోరారు. పైగా, రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఎన్టీఆర్‌కు టీడీపీ ప్రభుత్వం కంటే వైకాపానే ఎక్కువ గౌరవ మర్యాదలు ఇచ్చిందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కృషి ఫలితంగానే ఈ హెల్త్ యూనివర్శిటీ ఏర్పాటైందని, అందువల్ల యూనివర్శిటీకి ఆయన పేరునే కొనసాగించాలని ఆయన కోరారు. 
 
"ఎన్టీఆర్ పేరు" - ఏపీలో ప్రకంపనలు.. యార్లగడ్డ రాజీనామా
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై టీడీపీ సభ్యలు అసెంబ్లీలో రాద్దాంతం సృష్టిస్తున్నారు. పలు చోట్ల ఆందోళనలకు దిగారు. మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సొంంత పార్టీ నేతలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇలాంటి వారిలో అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామా చేశారు. దేనికైనా వైఎస్ఆర్ పేరు పెట్టడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదనీ కానీ, ఎన్టీఆర్ పేరును తొలగించి ఆ స్థానంలో వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని మాత్రం తాను అంగీకరించబోనని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందన్నారు. అలాంటి టీడీపీతో చంద్రబాబు చేతుల కలపడాన్ని తాను జీర్ణించుకోలేక పోయినట్టు చెప్పారు. పైగా, ఎన్టీఆర్ తన వారసులను రాజకీయాల్లోకి తీసుకునిరాలేదని, చంద్రబాబు మాత్రం తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. పైగా, ఎన్టీఆర్‌కు అప్పటి ప్రధాని వాజ్‌పేయి భారత రత్న ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆరోపించారు.