శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 19 మార్చి 2019 (21:58 IST)

కేవ‌లం 18 రోజులు... ఏపీలో రూ.10 కోట్ల మ‌ద్యం స్వాధీనం

ఎన్నిక‌ల వేళ ఎక్సైజ్ శాఖ చేప‌ట్టిన చ‌ర్య‌లు స‌త్ ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. మ‌ద్యం నిల్వ‌లు, అన‌ధికార స‌ర‌ఫ‌రాపై ఉంచిన నిఘా ఫ‌లితంగా మునుపెన్న‌డూ లేని విధంగా అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట ప‌డే ప‌రిస్ధితులు క‌నిపిస్తున్నాయి. అధికారికంగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌టానికి ముందే రాష్ట్ర అబ్కారీ క‌మీష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనా చేప‌ట్టిన చ‌ర్య‌ల ఫ‌లితంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పెద్ద ఎత్తున అక్ర‌మ మ‌ధ్యం నిల్వ‌ల‌ను వెలికి తీసి సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌జావుగా జ‌రిగేందుకు ప‌రోక్షంగా కార‌ణం అవుతోంది. 
 
మునుపెన్న‌డూ లేని స్ధాయిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది ప‌రుగులు పెడుతుండ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు ప‌దికోట్ల రూపాయ‌ల విలువైన అక్ర‌మ మ‌ధ్యం సీజ్ అయ్యింది. మొత్తంగా రెండు ల‌క్ష‌ల యాభైవేల లీట‌ర్ల మ‌ద్యం స్వాధీనం చేసుకోగా, ఐడి లిక్క‌ర్ 33వేల లీట‌ర్లు, ఎన్‌డిపిఎల్ రెండువేల రెండు వంద‌ల లీట‌ర్లు, ఐఎంఎఫ్ఎల్ విభాగంలో రెండు ల‌క్ష‌ల లీట‌ర్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. నిజానికి 2014 ఎన్నిక‌ల వేళ నోటిఫికేష‌న్ నుండి పోలింగ్ వ‌ర‌కు 2.43 ల‌క్ష‌ల లీట‌ర్ల మ‌ధ్యం స్వాధీనం చేసుకోగా దాని విలువ రూ. 9.53 కోట్లుగా ఉంది.
 
అంటే 2014 ఎన్నిక‌ల వేళ మొత్తం కాలానికి గాను రూ.9.53 కోట్ల విలువైన మ‌ధ్యం స్వాధీనం చేసుకోగా ప్ర‌స్తుతం పోలింగ్‌కు మ‌రో 25 రోజ‌ల స‌మ‌యం ఉండ‌గానే, కేవ‌లం 18 రోజుల వ్య‌వ‌ధిలోనే రూ.10 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాట‌టం అబ్కారీ శాఖ నిబద్ధ‌త‌కు ద‌ర్ప‌ణం ప‌డుతోంది. మ‌రోవైపు గ‌త సంవ‌త్స‌రం తెలంగాణ‌లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల‌లో సైతం కేవ‌లం రూ.13 కోట్ల విలువైన అక్ర‌మ మ‌ధ్యం స్వాధీనం చేసుకోగా ఆంధ్రప్ర‌దేశ్ ఎక్సైజ్ శాఖ త‌న ప‌నితీరుతో జాతీయ స్దాయిలోనే మైలు రాయిగా నిలుస్తోంది. 
 
ఈ నేప‌ధ్యంలో మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో త‌న‌ను క‌లిసిన పాత్రికేయిల‌తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఫ‌లితంగానే ఇంత పెద్ద ఎత్తున మ‌ధ్యం నిల్వ‌ల‌ను స్వాధీనం చేసుకోగ‌లుగుతున్నామ‌న్నారు.
 
 ఎటువంటి వ‌త్తిడులు లేకుండా ఎన్నిక‌ల క‌మీష‌న్ ఆదేశానుసారం సిబ్బంది 24గంట‌లు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నార‌ని పోలింగ్ ముగిసే వ‌ర‌కు ఇదే వేగాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని ఆదేశించామ‌న్నారు. అంత‌ర్‌రాష్ట్ర స‌మ‌న్వ‌యం కూడా స‌త్ ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని అయా రాష్ట్రాల సిబ్బందితో క‌లిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ దాడులు చేప‌డుతుంద‌ని మీనా పేర్కొన్నారు. 
 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ హ‌రికుమార్ నేతృత్వంలో స్టేట్ టాస్క్ ఫోర్స్ వేగంగా స్పందిస్తుంద‌న్నారు. స్ప‌ష్ట‌మైన యాక్ష‌న్ ప్లాన్ మేర‌కు త‌మ విభాగం ప‌నిచేసుకుపోతుంద‌ని, ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చిన టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు స‌గ‌టు ప్ర‌జ‌ల నుండి ఫిర్యాధులు వ‌స్తున్నాయ‌ని, వాటిని 48 గంట‌ల వ్య‌వ‌ధిలో ప‌రిష్క‌రిస్తున్నామ‌ని క‌మీష‌న‌ర్ వివ‌రించారు.