ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (08:54 IST)

వైఎస్.వివేకానంద రెడ్డిని చంపిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం : పవన్ కళ్యాణ్ హెచ్చరిక

pawan - babu
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నిడదవోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు. "వివేకా హత్య కేసు నిందితులను వెనకేసుకుని వస్తున్నాడు. సొంత చెల్లెళ్లకే గౌరవం ఇవ్వని వ్యక్తికి సగటు ఆడపిల్లలు ఓ లెక్కా? 3 వేల మంది ఆడబిడ్డలు ఆచూకీ లేకుండా పోతే, ఈ సీఎం ఇప్పటివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పార్లమెంటు ఉభయ సభల్లో 30కి పైగా సభ్యులు ఉండి కూడా రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ చర్చ జరపలేదు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.
 
అంతేకాకుండా, ఎదిరించే వాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యమని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఐదుగురి చేతిలో రాష్ట్రం నలిగిపోతోందని తెలిపారు. అధికారం, పెత్తనం అంతా వారి చేతుల్లోనే ఉందని ధ్వజమెత్తారు. ఐదుగురు వ్యక్తులు ఐదు కోట్ల మంది ప్రజలను అణచివేస్తుంటే అందరూ కలిసి రావాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని భావించి పొత్తు పెట్టుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
 
ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. ఏదైనా నిలదీస్తే నాపై, చంద్రబాబుపై, పురంధేశ్వరిపై బూతులు తిడతారు అని మండిపడ్డారు. ఏ ఒక్కరినీ వదిలేది లేదని, వచ్చేది కూటమి ప్రభుత్వమేనని హెచ్చరించారు. ఢిల్లీలో మోడీ నాయకత్వం, ఏపీలో చంద్రబాబు అనుభవం, ఐదేళ్లుగా వైసీపీ దాడులను తట్టుకుని నిలబడిన జనసైనికులు, వీరమహిళలను కలుపుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చామని రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలన్నదే తమ అజెండా అని వివరించారు. 
 
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి, పరిశ్రమలు ఏర్పాటై అభివృద్ధి దిశగా రాష్ట్రం అని పెద్ద మనసుతో ఆలోచించి సీట్ల సర్దుబాటు విషయంలో బాగా తగ్గామని, ముఖ్యంగా, సంస్థాగతంగా బలంగా ఉన్న చంద్రబాబు కూడా టీడీపీ విషయంలో బాగా తగ్గారని పవన్ వివరించారు. నిడదవోలు నుంచి ఈసారి జనసేన పార్టీ బరిలో ఉందని, కందుల దుర్గేశ్ పోటీ చేస్తున్నారని వెల్లడించారు. కందుల దుర్గేశ్ గెలిచిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి జనసేన వద్ద ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.