శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 29 జనవరి 2018 (21:10 IST)

కిలిమంజారో అధిరోహించిన ఏపీ విద్యార్థులు... మంత్రి అభినందనలు

అమరావతి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు అభినందించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్లో సోమవారం మధ్యాహ్నం మ

అమరావతి: ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులను సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు అభినందించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్లో సోమవారం మధ్యాహ్నం మంత్రి ఆ విద్యార్థినీ, విద్యార్థులను, వారి కోచ్‌లను శాలువాలు, పూలమాలలో సత్కరించి, సర్టిఫికెట్లు అందజేశారు.


పది మంది విద్యార్థినులు ఎస్.శిరీష, కె.రమ్యశ్రీ, బి.ఇందిరాబాయి, వై.కవిత, సీ.పద్మావతి, కె.మహాలక్షి, జీ.హేమలత, బి.సునీత, కె.అమ్ములు, ఎం.సీ.మహాలక్ష్మి, అయిదుగురు విద్యార్థులు డి.లక్ష్మణ్, బి.రమేష్, వి.శ్రీకాంత్, డి.కృష్ణ కుమార్, బి.సురేష్ మొత్తం 15 మంది ఆఫ్రికా ఖండం టాంజానియా దేశంలోని 19,341 అడుగుల కిలిమంజారో పర్వత శిఖరం అధిరోహించి ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవం రోజు 1350 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
 
అంతేకాకుండా గౌరవ సూచకంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనందబాబు, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల జెండా చిత్రపటాలను అక్కడ ఉంచారు. విద్యార్థులకు శేఖర్ బాబు, పరమేష్ కుమార్, రఘునాథ్‌లు కోచ్‌లుగా శిక్షణ ఇచ్చారు. కోచ్ రఘునంద్ టీమ్ లీడర్‌గా, నీలిమ గైడ్‌గా వ్యవహరించి వారిని కిలిమంజారో పర్వత శిఖరం వరకు తీసుకువెళ్లి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ తమ గురుకుల పాఠశాలల విద్యార్థులు చదువులోనే కాకుండా అనేక సాహస కార్యక్రమాలలో పాల్గొంటూ విజయశిఖరాలను అధిరోహిస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. 
 
తమ విద్యార్థులు కూచిపూడి నృత్యంలో, కోలాటంలో, మారాథన్‌లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారని, 9 మంది విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం అధిరోహించారని గుర్తు చేశారు. తమ విద్యార్థులు అందరూ మట్టిలో మాణిక్యాలన్నారు. ఈ విద్యార్థులు కిలిమంజారో శిఖరంపైన ప్రపంచంలోనే అత్యంత నిడివి గల 1350 అడుగుల జాతీయ పతాకాన్ని ఎగురవేశారని తెలిపారు. గతంలో తెలంగాణ విద్యార్థులు 600 అడుగుల పతాకాన్ని ఎగురవేశారని చెప్పారు. ఇటువంటి సాహస కార్యక్రమాలకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల సొసైటీ కార్యదర్శి కల్నల్ వి.రాములు, కోచ్‌లను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.