546 కేజీల గంజాయి పట్టివేత.. ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
విజయవాడ మీదుగా రోడ్డు మార్గంలో తమిళనాడు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 546 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు నిందితులను విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి రూ.27.30లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక లారీని సీజ్ చేశారు.
నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు ఆదేశాల మేరకు విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవల విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి.కె.వి.శ్రీనివాసరావుకు అందిన పక్కా సమాచారం మేరకు ఏ.సి.పి. వి.ఎస్.ఎన్.వర్మ, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, రవితేజ, వెంకటేశ్వరరావు మరియు వారి సిబ్బందితో కలిసి గురువారం విజయవాడ, నున్న పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రకాష్‌నగర్ సెంటర్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు.
టిఎన్52డి3393 నెంబరు గల 12 చక్రాల లారీలో ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రోడ్డు మార్గం ద్వారా విశాఖ జిల్లా, యలమంచిలి హైవే వద్ద గంజాయిని లోడు చేసుకుని విజయవాడ మీదుగా తమిళనాడు రాష్ట్రానికి రోడ్డు మార్గం గుండా ఎవరికీ అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఏలువలై వెంకటేష్(33), పనమారతు పట్టి పోస్టు, సాలెం జిల్లా, తమిళనాడు.(లారీ యజమాని), లోకనాధం రాజేష్ కన్నా(30), పనమారతు పట్టి పోస్టు, సాలెం జిల్లా, తమిళనాడు. (లారీ క్లీనర్)లు ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ.27.30 లక్షలు విలువైన 546 కేజీల గంజాయి, ఒక లారీని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో... పై నిందితులు ఇద్దరు తమిళనాడు, సాలెం జిల్లా, పనమారతు పట్టి ప్రాంతానికి చెందిన వెంకటేష్ లారీ యజమాని తన బంధువు అయిన రాజేష్ ఇద్దరూ కలసి ఇచ్చాపురంలోని కె.ఆర్.ఎస్. పార్సిల్ ఆఫీస్ వద్ద వివిధ రకాల వస్తువులు లోడు చేసుకుని మార్గం మద్యంలో మధురైకు చెందిన మోహన్ సూచన మేరకు విశాఖ జిల్లా, యలమంచిలి హైవే వద్ద గంజాయిని అదే లారీలో లోడు చేసుకుని రాయవెల్లేరు, తమిళనాడు రాష్ట్రానికి వెళ్తుండగా విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు.
ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాను గుర్తించి నిరోధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చిన టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు అభినందించారు.