బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2020 (15:53 IST)

దారిదొపిడీలకు పాల్పడుతున్న 9 మంది విలేఖర్లు అరెస్ట్... ముఖాలకు ముసుగులు

కృష్ణాజిల్లా నందిగామ... అర్థరాత్రి సమయంలో వాహనాలను అడ్డుకుని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న తొమ్మిది మంది విలేకరులపై వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 జగ్గయ్యపేట 6 టీవీ ఛానల్‌కు చెందిన విలేఖరి కొండ్రు సందీప్ మరియు 19 యూట్యూబ్ ఛానల్‌కు చెందిన శ్రీనివాస్, విట్నెస్ యూట్యూబ్ ఛానల్‌కు చెందిన వంశీకృష్ణ అనే వ్యక్తులు గత ఆదివారం రాత్రి సమయంలో వీరులపాడు మండలం జయంతి గ్రామంలో రహదారిపై వెళ్తున్న లారీని ఆపి తమ దగ్గర ఉన్న కత్తిని చూపించి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో లారీ వెనుక వస్తున్న ముఠా కార్మికులు లారీ డ్రైవర్‌తో కలసి 6 టివి రిపోర్టర్ సందీప్‌ను చితకబాది ముగ్గురు వ్యక్తులను వీరులపాడు పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
 
లారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా వీరితో కలిసి గతంలో ఇదేవిధమైన అక్రమ వసూళ్లకు పాల్పడిన నందిగామ ఆంధ్రప్రభ విలేకరి మంగూనూరి నరసింహ రెడ్డి, కోస్తా ఆంధ్ర విలేకరి తిరుపతిరావు, H6 యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఉప్పుతల వీరబాబు, Zee News యూట్యూబ్ ఛానల్ విలేఖరి కొంగర నవీన్, VSB యూట్యూబ్ ఛానల్ విలేఖరి ఆవుల గోపికృష్ణతో పాటు చిన్నా అనే మరొక యూట్యూబ్ ఛానల్ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఈ తొమ్మిది మందిపై సంబంధిత సెక్షన్లలో కేసు నమోదు చేసినట్లు సమాచారం. కానీ విలేకరులు రహదారిపై ఆపిన లారీ అక్రమంగా రేషన్ బియ్యం తీసుకు వెళుతుందని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన లారీలో ఎటువంటి లోడు లేదని అక్రమంగా తీసుకువెళ్తున్న బియ్యం పక్కదారి పట్టిందని వదంతులు వినిపిస్తున్నాయి.