సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 20 నవంబరు 2019 (16:22 IST)

పెళ్ళయి ఏడురోజులు.. భర్తకి పాలల్లో విషమిచ్చి చంపేందుకు భార్య యత్నం..

వాళ్ళిద్దరికీ వారం క్రితమే పెళ్ళయ్యింది. ఏడు జన్మల బంధానికి ప్రతీకగా ఏడుఅడుగులు వేశారు. కడ వరకు తోడుగా ఉంటానంటూ ఇద్దరూ బాసలు చేసుకున్నారు. కానీ ఆ ఏడడుగుల బంధం ఏడురోజులకే చెల్లిపోయింది. పెళ్ళయిన వారంరోజులకే ఆ భర్త ఐసియులో చేరాడు.

కాళ్ళ పారాణి ఆరకముందే భర్త హత్యకు స్కెచ్ వేసింది ఆ నవ వధువు. నూరేళ్ళ బంధానికి ఏడురోజుల్లోనే స్వస్తి పలుకుతూ భర్తకు విషం కలిపిన పాలిచ్చింది భార్య. ప్రస్తుతం ఆ భర్త చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు.
 
కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామానికి చెందిన లింగయ్యకు మదనంతపురానికి చెందిన నాగమణికి పెళ్ళయి వారంరోజులయ్యింది. పెళ్ళి తరువాత సాంప్రదాయాల్లో భాగంగా లింగమయ్య అత్తారింటికి వచ్చాడు. ఇంట్లో  పెద్దవాళ్ళంతా ఏవేవో పనుల్లో బిజీ అయ్యారు. ఆ సమయంలో భర్త ముందుకు పాల గ్లాస్‌తో వచ్చింది భార్య. ఆమె నవ్వుతూ ఇచ్చిన పాల గ్లాసును తీసుకుని ఆనందంగా తాగేశాడు లింగమయ్య. 
 
అంతే.. భార్య ఇచ్చిన పాలు తాగిన వెంటనే లింగమయ్యకు కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో తట్టుకోలేకపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ కిందపడ్డాడు. వెంటనే బంధువులు పరుగెత్తుకొచ్చారు. అల్లుడికి ఏమైందో ఏమోనని హడివిడిగా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే లింగమయ్య అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో అనంతపురం ఆసుపత్రికి తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు.
 
అతడిని అనంతపురంకు తీసుకెళ్ళారు బంధువులు.  ప్రస్తుతం లింగమయ్య ఐసియులో ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య ఎందుకు విషమిచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో పెళ్ళికి ముందే తనకు వేరొక యువకుడితో పరిచయం ఉందని.. లింగమయ్యను పెళ్ళి చేసుకోవడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని నాగమణి స్పష్టం చేసిందట. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.