శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2017 (15:34 IST)

కేంద్రాన్ని ఏకిపారేసిన శివాజీ: కొత్త పార్టీలంతా బీజేపీ సృష్టే.. ప్రత్యేక హోదా ఇస్తే?

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సినిమా హీరో శివాజీ ఏకిపారేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కూడా శివాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు పెడతామంటున్నారని.. ఇవన్నీ బీజేపీ సృష్టేన

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను సినిమా హీరో శివాజీ ఏకిపారేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కూడా శివాజీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త కొత్త పార్టీలు పెడతామంటున్నారని.. ఇవన్నీ బీజేపీ సృష్టేనని.. ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదని... ఏపీకి ప్రత్యేక హోదా టానిక్ లాంటిదా అంటూ పలువురు నేతలు ప్రశ్నించడాన్ని శివాజీ తప్పుబట్టారు.
 
ప్రత్యేక హోదా తమ హక్కు అని.. ఏపీకి హోదా టానిక్ లాంటిదేనని నొక్కి చెప్పారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని.. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా వాళ్లకి పోయేదేముందని శివాజీ ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కోట్లు కోట్లు కుమ్మరిస్తోందని.. కానీ ఏపీ తరపున 40 సీట్లు గెలిచి.. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ప్రత్యేకహోదాను పక్కనబెట్టేసిందని ధ్వజమెత్తారు. 
 
బీహార్‌కు ప్యాకేజీ కింద లక్షా 20కోట్లు ఎందుకిచ్చారని శివాజీ అడిగారు. కేంద్ర ప్రభుత్వం నివేదికలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కరువుందని తెలియడంతో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి రూ.3వేల కోట్లు, రేపు ఎన్నికలు రాబోతున్నందున ఏపీకంటే చిన్న రాష్ట్రమైన కర్ణాటకకు రూ.2వేల కోట్లు ఇచ్చారని శివాజీ తెలిపారు. 
 
కానీ ఆంధ్రప్రదేశ్‌లో రైతులు కష్టాల్లో వుంటూ.. ఆడపిల్లలను అమ్ముకుంటున్న పరిస్థితి ఏర్పడినా... రూ.700 కోట్లు కేటాయిస్తారా అంటూ శివాజీ నిలదీశారు. ఈ విధంగా తమను మోసం చేసేందుకు ఏపీ ప్రజలు ఏం పాపం చేశారని అడిగారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఏపీని మరిచిపోయిన బీజేపీ పుట్టగతులుండవని హెచ్చరించారు. ఆ పార్టీ నేతలకు కూడా ఇదే పరిస్థితి తప్పదని శివాజీ ఎత్తిచూపారు. బీజేపీపై నమ్మకం పోయిందన్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్ర, కేంద్ర మంత్రులు ఇష్టానికి వచ్చినట్లు మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చారు.