సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 13 నవంబరు 2021 (16:17 IST)

దిల్లీలో వాయి కాలుష్యంపై సుప్రీం ఆందోళ‌న‌, ఇంట్లోనూ మాస్కులే!

దేశ రాజధాని దిల్లీలో నెలకొన్న గాలి కాలుష్యంపై శనివారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని వ్యాఖ్యానించింది. ఈ శీతకాలం వేళ దిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.
 
 
పరిస్థితి ఎంత దిగజారిందో మీరే చూడండి. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. దిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారు. ఫలితంగా దిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అయితే వాటిని దహనం చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు వెల్లడించింది. ‘పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలు దహనం చేయడంతో, గత వారం రోజులుగా దిల్లీలో నెలకొన్న పరిస్థితులకు కారణమైంది. దీన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాల్సి ఉంది’ అని వెల్లడించింది.
 
 
అయితే ఈ సమాధానంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక అంచనాకొస్తున్నారు? ఈ కాలుష్య పరిస్థితులకు అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియజేయండి. రెండు రోజుల లాక్‌డౌన్ ఏమైనా విధిస్తారా?’ అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది.