టీటీడీ ఆధీనంలోకి అలత్తూరు శ్రీ వరద వెంకన్న ఆలయం
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం అలత్తూరు గ్రామంలోని శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం సోమవారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారాయణస్వామి సమక్షంలో ఈ విలీన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి అనుగ్రహంతో 1560 సంవత్సరాల పురాతనమైన అలత్తూరు గ్రామంలోని శ్రీ వరద వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని టిటిడిలో వీలినం చేయడం జరిగిందన్నారు.
తద్వారా ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పురాతన ఆలయాలను టిటిడి అభివృద్ధి చెస్తొందన్నారు. టిటిడి య.సి., యస్.టి., బి.సి., కాలనీలల్లో ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం రాష్ట్ర దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ చంద్రమౌళి ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి అధికారులకు అందజేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ కార్యక్రమంలో కార్వేటినగరం తహశీల్దార్ శ్రీ గౌరిశంకర్, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.