భారతీయ రాజకీయ వ్యవస్థలో ఓ చీడపురుగు రఘురామరాజు : అంబటి రాంబాబు
రఘురామరాజు ఏ రకంగా రాజద్రోహానికి పాల్పడ్డారో వివరిస్తూ.. సీఐడీ ఏకంగా 46కి పైగా వీడియోలను కోర్టు ముందు సమర్పించింది. ఇటువంటి వ్యక్తి భారత రాజకీయ వ్యవస్థలో ఒక చీడపురుగు. ఇటువంటి వ్యక్తిని సమర్థిస్తున్న చంద్రబాబు నాయుడ్ని ఏమనాలో ప్రజలకే వదిలివేస్తున్నాం. ప్రతిరోజూ రెండు గంటల పాటు రచ్చబండ పేరుమీద నోటికి వచ్చిన బూతులు తిట్టడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో ఒక డ్రామా నడపటం చంద్రబాబు నాయుడుకు, లోకేశ్‌కు వారి అనుచరులైన టీవీ5, ఏబీఎన్ ఛానళ్లకు అలవాటుగా మారిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో విమర్శను ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోరు. విమర్శను ఎవరైనా ఆహ్వానిస్తారు. అయితే అధికార పార్టీ తరుపున ఎన్నికై పిచ్చి వాగుడు వాగుతుంటే.. ఎంతో సంతోషపడి ఆయన వెనకనుండి ఈ కథను నడిపించిన చంద్రబాబుకు ఇప్పుడు రఘరామ అరెస్ట్‌తో గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది.
బహుశా.. తనకు కూడా ఇదే గతి పడుతుందన్న భయం ఒకపక్క, రఘురామరాజుతో ఇన్నాళ్లు నడిపిన అపవిత్ర బంధం బయటపడుతుందన్న భయం మరోపక్క చంద్రబాబును వెంటాడుతోంది. రఘురామరాజుతో నిజాలు చెప్పిస్తే తమ ఇంటి గుట్టు, తాము చేసిన కుట్రలు బయటపడతాయన్న భయంతోనే నిన్న టీడీపీ, దాని అనుబంధ ఛానళ్లు మరుక్షణం రఘురామరాజుకు వత్తాసు పలికాయి.
ఈరోజు కూడా రఘురామరాజు ప్రవర్తనలో బెయిల్ ఫిటిషన్ డిస్మిస్ చేసిన వెంటనే ఎంతటి మార్పు వచ్చేసిందో, ఎంతటి డ్రామా ఆడారో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వివరించారు. రఘురామరాజు మహా నటుడు. తనకు తాను గాయాలు చేసుకొని మరీ.. బయటపడాలని ప్రయత్నించగల సమర్థుడు. బహుశా.. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ముందుగా ఊహించే ఈ విషయంలో కూడా స్కెచ్ వేసి ఉంటారని భావించాలి.
అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లు... రఘురామరాజుపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం తీవ్ర నేరం అంటూ చంద్రబాబు చేసిన ప్రకటన ఆయనలో భయాన్ని, తాను కూడా దొరికిపోబోతున్నా అన్న భావాన్ని చూపిస్తోంది. పురంధేశ్వరి వంటి బీజేపీ నేతలు కూడా బాబు వాదనకు మద్దతు పలకటం సిగ్గుచేటు. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు.. రాజద్రోహం అవునో, కాదో చెప్పాల్సింది న్యాయస్థానాలే తప్ప చంద్రబాబు కాదు.
రఘురామరాజును ఎవ్వరూ రాజకీయ కక్ష సాధింపు చేయలేదు. రఘురామరాజే ఏడాదికి పైగా రాజకీయ కక్ష సాధింపుకు, ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నానికి, రాజద్రోహానికి టీడీపీతో జత కట్టి మరీ పాల్పడ్డాడు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. కేసు దర్యాప్తు జరగాలి. చంద్రబాబు పాత్ర కూడా తేలాలి. దీన్ని అడ్డుకునే ప్రతి ప్రయత్నం చంద్రబాబు భయంతో చేస్తున్న ప్రయత్నమే తప్ప ప్రజాస్వామ్యం మీద భక్తితో చేస్తున్న ప్రయత్నం కాదు. ఎన్నికల్లో గెలవలేని చంద్రబాబు ఏదో రకమైన మేనేజ్‌మెంట్ మీదే వంద శాతం నమ్మకాలు పెట్టుకొని రఘురామరాజుతో అంటకాగుతున్నాడని ఇంతకాలం అందరూ అనుమానించింది స్పష్టమైంది. తోడు దొంగలు ఇద్దరి ముసుగు తొలిగింది అని వ్యాఖ్యానించారు.