ఉక్రెయిన్‌కు ఏపీ తరపున ప్రత్యేక ప్రతినిధులు : సీఎం జగన్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో చిక్కున్న రాష్ట్ర వాసులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, తెలుగు విద్యార్థుల తరలింపునకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని పంపాలని సీఎం జగన్ నిర్ణయించారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వందలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకునివున్నారు. వారిని స్వదేశానికి రప్పించాలని కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసాయి. అలాగే, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తోనూ మాట్లాడారు. అయితే, ఉక్రెయిన్ గగనతలంలో విమానరాకపోకలను నిషేధించడంతో సరిహద్దు దేశాల నుంచి కేంద్రం వాయుసేన విమానాల ద్వారా భారతీయులను తరలించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు.
నలుగురు కేంద్ర మంత్రులను కూడా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కూడా పంపేలా ప్రధాని మోడీ ఆదేశించారు. ఇపుడు ఏపీ ప్రభుత్వం కూడా ప్రతినిధులను హంగేరీ, పోలాండ్, రొమేనియా దేశాలకు పంపాలని నిర్ణయించింది. ఈ ప్రతినిధులు కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుంటూ తెలుగు విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.