శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జులై 2020 (13:36 IST)

ఆ షోకాజ్ నోటీసు... ఈవీవీ మూవీలా ఉంది : వైకాపా ఎంపీ

వైకాపాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆ పార్టీ అధిష్టానం ఇటీవల షోకాజ్ నోటీసు ఇచ్చింది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్‌పై జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సంతకంతో ఉంది. ఈ నోటీసును అందుకున్న రఘురామకృష్ణంరాజు హాస్యాస్పందంగా స్పందించారు. ఈ షోకాజ్ నోటీసు చదివితే ఓ ఈవీవీ సినిమాను తలపిస్తుందన్నారు. 
 
పార్టీ వేరు.. ప్రభుత్వం వేరన్న విషయాన్ని విజయసాయి గుర్తించలేకపోయారని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించినందుకే తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చారని.. అది వైసీపీకి నష్టం కలిగించవచ్చన్నారు. 'నేను లోక్‌సభలో మాతృభాషపై మాట్లాడినందుకు పార్టీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి అభినందించారు. కానీ సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఆయన్ను కలిసి వివరించాను.
 
ఇంగ్లీష్‌ మీడియం అంశాన్ని పార్టీ మేనిఫెస్టోలో పెట్టినా అది రాజ్యాంగానికి వ్యతిరేకం. నాకు ఇచ్చిన షోకాజ్‌లో పేర్కొన్న అంశాలేవీ పార్టీని వ్యతిరేకించేవి కావు' అని వ్యాఖ్యానించారు. తనకు కేంద్ర మంత్రి పదవి ఖరారైందన్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. 
 
బీజేపీ తనకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వైసీపీలో ఉన్నా ఇవ్వొచ్చని తెలిపారు. వైసీపీ తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని బహిష్కరించినా.. తాను వేరే పార్టీలో చేరేందుకు నిబంధనలు అంగీకరించవన్నారు. తాను నిర్వహిస్తున్న పార్లమెంటరీ సబార్డినేట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవిని వల్లభనేని బాలశౌరికి ఇవ్వాల్సిందిగా వైసీపీ సిఫారసు చేసిందని గుర్తుచేశారు. 
 
కేంద్ర బలగాలతో తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శిని మరోదఫా కోరానని అన్నారు. రాష్ట్రప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తానని చెప్పినందునే కేంద్రం తనకు వెంటనే రక్షణ కల్పించడం లేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా పరిస్థితి బాగాలేనందున్నారు. దళిత క్రైస్తవులు ఎస్సీకోటా అనుభవిస్తుండటంతో హిందూ దళితులు నష్టపోతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.