నల్లచొక్కా ధరించి అసెంబ్లీకి వచ్చిన చంద్రబాబు - గవర్నర్ ప్రసంగం బాయ్‌కట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. అయితే, ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేసించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. అయితే, గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలోనే బాయ్‌కాట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం గొంతు నొక్కేస్తున్నారని, తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఉదయం నల్ల చొక్కాలను ధరించి అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత, జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు.
గడచిన యేడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఎక్కడా ఏ పనులూ జరగడం లేదని, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ, ఈ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకు మాత్రమే సమావేశమవుతోందని, ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి జగన్ సర్కారుకు ఏమాత్రం లేదన్నారు. అందుకే కేవలం రెండు రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగిస్తున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు. పలు అంశాల్లో ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు.