శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (12:28 IST)

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు-బాలికలదే పైచేయి

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో కమిషనర్‌ సంధ్యారాణి విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల్లో 94.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 94.68 శాతం, బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు సంధ్యారాణి ప్రకటించారు. 
 
మార్చి 18 నుంచి ఏప్రిల్‌ మూడో తేదీ వరకు 2,839 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,21,634 మంది విద్యార్థులు పదోతరగతి చదవగా వీరిలో 99.5 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా 11,690 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, వారిలో 5,464 పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. మూడు పాఠశాలల్లో సున్నాశాతం ఫలితాలు నమోదయ్యాయి. 
 
అందులో రెండు ప్రైవేటు పాఠశాలలు, ఒక ఎయిడెడ్‌ స్కూల్‌ ఉన్నాయి. పదో తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.