సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 12 ఆగస్టు 2021 (10:51 IST)

సింహాన్ని సింహమే చంపుతుంది.. చిట్టెలుకలు చంపవు..

ఏపీలో సంచలనం రేపుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరిన్ని సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా పేర్కొంటూ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ విషయంలో పలు చర్చలు సాగుతుండగావే.. తాజాగా ఆయన సోదరుడు కిరణ్ యాదవ్... సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
వివేకా హత్య కేసులో ఆధారాల కోసం నిన్న సీబీఐ అధికారులు.. నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఇంట్లో తనిఖీలు చేశారు. పలు బ్యాంక్ పాస్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆయన సోదరుడు కిరణ్ యాదవ్ మండిపడ్డారు. తాము చాలా సాధారణ వ్యక్తులమని, వివేకాను హత్య చేసేటంత వ్యక్తులం కాదని అన్నాడు. సోదాల పేరుతో సీబీఐ అధికారులు తమ ఇల్లంతా చిందరవందర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సీబీఐ అధికారులు సునీల్ యాదవ్ బ్యాంకు బుక్కులు, ఓ పాత చొక్క తీసుకెళ్లారని కిరణ్ తెలిపారు. తాము తాము సిబిఐ వేధింపులు తట్టుకోలేకే రిట్ పిటిషన్ వేశామని, కానీ మేము రీట్ పిటిషన్ వేసినందుకు కక్ష సాధింపు కోసం వేధిస్తున్నట్లున్నారని కిరణ్ ఆరోపించాడు. 
 
అమాయకులమనేనా, మమ్ముల్ని ఇబ్బంది పెడుతున్నారని సీబీఐ అధికారుల్ని కిరణ్ యాదవ్ ప్రశ్నించారు. సింహాన్ని సింహమే చంపుతుంది కానీ చిట్టెలుకలు చంపలేవంటూ నర్మ గర్భంగా వైఎస్ కుటుంబ పాత్రపై కిరణ్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తామెలాంటి తప్పూ చేయలేదన్నారు. అయినా సీబీఐ అధికారులు కక్షగట్టి తమను వేధిస్తున్నారని కిరణ్ ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు చేసిన తన సోదరుడు సునీల్ యాదవ్ కూ ఈ హత్యకూ ఎలాంటి సంబంధం లేదని ఆయన తెలిపారు.