శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (09:06 IST)

ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ భాజపా నేతల భేటీ

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ భాజపా నేతలు భేటీ అయ్యారు. రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మాజీ మంత్రి,జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ సహా ఇంచార్జి సునిల్ దేవధర్,ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని నేతలు ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దాదాపు అన్ని రాజకీయ పక్షాలు గత కొద్దిరోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాజపా నేతలు కేంద్రమంత్రిని కలిసి నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సోము వీర్రాజు, పురందేశ్వరి మీడియాతో మాట్లాడారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆంధ్రులు వ్యతిరేకిస్తున్నారని.. ప్రజల మనోభావాలను పరిరక్షించాల్సిన అవసరముందని కేంద్రమంత్రికి తెలిపినట్లు సోమువీర్రాజు చెప్పారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు ఉన్న ప్రత్యామ్నాయ అంశాలు.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.

ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరినట్లు చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ముఖ్యనేతలను కలిసి ఉక్కు కర్మాగారం విషయంలో ఉన్న మనోభావాలను వివరిస్తామని తెలిపారు. 
 
పురందేశ్వరి మాట్లాడుతూ.. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు పలు ప్రత్యామ్నాయాలు సూచించామన్నారు. సెయిల్‌, ఎన్‌ఎండీసీలో విలీన ప్రతిపాదనలు చేశామని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఉక్కు కర్మాగారం ఉద్యోగుల శ్రేయస్సును పరిరక్షించాలని కేంద్రమంత్రిని కోరినట్లు పురందేశ్వరి తెలిపారు.