కరుణించిన అమిత్ షా.. ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరోమారు ఢిల్లీకి వెళుతున్నారు. తనను కలిసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళుతున్నారు.
నిజానికి సోమవారమే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సిందే. కానీ, హోం మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజాగా ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే, కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా ఆదుకోవాలని జగన్ ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రేపటి జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవానికి జగన్ పర్యటన వెనుక రాష్ట్ర ప్రయోజనలా కంటే.. వ్యక్తిగత ప్రయోజనాలే ప్రధానాంశాలుగా ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది.
అలాగే, ఏపీ సీఐడీ పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించడాని వైకాపా రెబెల్ ఎంపీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలకు లేఖల ద్వారా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.