శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (15:30 IST)

పేదింటి తల్లులకు జగన్ కానుక అమ్మఒడి.. యేడాదికి రూ.15 వేలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేదింటి తల్లులకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అరుదైన కానుక ఇచ్చారు. తన ఎన్నికల హామీలో భాగంగా, అమ్మఒడి పథకానికి ఆయన గురువారం శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద అర్హులైన లబ్దిదారులకు యేడాదికి రూ.15వేలు ఇవ్వనున్నారు. ఈ పథకాన్ని గురువారం చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమ్మ ఒడి పథకం తన చేతుల మీదుగా ప్రారంభంకావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. పిల్లల్ని బడికి పంపే పేద తల్లులకు ఈ పథకం కానుకగా ఇస్తున్నామన్నారు. అమ్మ ఒడి పథకం కింద ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో 82 లక్షల మంది విద్యార్థులకు అమ్మ ఒడి మేలు చేస్తుందన్నారు. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. 
 
పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే అమ్మ ఒడి పథకం తీసుకువచ్చామన్నారు. చదువు పిల్లలకు మనమిచ్చే నిజమైన ఆస్తి అని అన్నారు. ఆర్టికల్‌ 21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు విద్యా ప్రాథమిక హక్కని, ప్రపంచంతో పోటీపడి విద్యార్థులు చదువుకోవాలని జగన్‌ పిలుపు ఇచ్చారు. అమ్మ ఒడి సొమ్మును బ్యాంకులు.. పాత అప్పులు సరిచేసుకునేందుకు వాడే వీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.