శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (20:12 IST)

కోర్టులు అక్షింతలు వేసినా వైకాపా మంత్రులు మారరు.. అంతే : కె రామకృష్ణ

కోర్టులు పలుమార్లు మొటిక్కాయలు వేసినా వైకాపా నేతలు, పాలకలు మారరని సీబీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌పై ఏపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తుండటం విచారకరమన్నారు. 
 
సుప్రీంకోర్టు తీర్పు తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు వస్తుందని, ఎన్నికలకు సహకరిస్తుందని అందరూ భావించారని... కానీ అది జరగలేదన్నారు. బాధ్యతాయుత మంత్రుల స్థానంలో ఉంటూ.. సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఎన్నికల కమిషన్‌ను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.
 
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గొంతుకగా చెప్పుకునే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఎస్ఈసీని కించపరిచేలా మాట్లాడుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. బెదిరింపులు, దాడులు, ప్రలోభాలతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా 2 వేలకు పైగా ఎంపీటీసీ, 125 జడ్పీటీసీలను వైసీపీ కైవసం చేసుకుందన్నారు. 
 
ఇలా దౌర్జన్యంగా గెలవాలనుకున్నప్పుడు ఎన్నికలు ఎందుకని నిలదీశారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఏకగ్రీవాలపై ఎందుకు ప్రకటనలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. జగన్ ఫొటోలతో ఉన్న వాహనాల ద్వారా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రేషన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని... ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని రామకృష్ణ అన్నారు.