సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సీఎం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా విశ్వాస ఘాతుక దీక్షలు

apcpsea
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత సీపీఎస్‌ను వారం రోజుల్లో రద్దు చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ ఇపుడు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా దాని ఊసెత్తకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మే డే ను పురస్కరించుకుని సీఎం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా విశ్వాస ఘాతుక దీక్షలు చేపట్టాలని ఉద్యోగులు నిర్ణయించారు. ఏపీ సీపీఎస్ ఉద్యోగా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా విశ్వాస ఘాతుక నిరసన నిర్వహిస్తుంది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యకుడు అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి పార్థసారథి వెల్లడించారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ, విపక్ష నేతగా ఉన్న సమయంలో అధికారంలో వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు హామీ పింఛన్ పథకం (జీపీఎస్) అమలు చేస్తామని ప్రకటించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో విశ్వాస ఘాతుకం పేరుతో నిరసన సభలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. 
 
పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజాప్రతినిధి ఆ హామీ నెరవేర్చకపోతే కాలర్ పట్టుకుని ఇంటికి పంపమని జగన్ ఎన్నికలకు ముందు చెప్పారని గుర్తు చేశారు. 
 
కాబట్టి ఇప్పుడాయనను కాలర్ పట్టుకుని నిలదీయాలో లేక ఎక్కడి పంపాలో ఆయనే చెప్పాలన్నారు. రాష్ట్ర బడ్జెట్  విషయంలో ఏ రోజూ శ్వేతపత్రం విడుదల చేయని ప్రభుత్వం సీపీఎస్ ఉద్యోగుల లెక్కపై మాత్రం కోట్ల ఖర్చుతో అసత్య ప్రచారాలు చేస్తోందని అప్పలరాజు, పార్థసారథి మండిపడ్డారు.