శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (14:29 IST)

'ట్రిపుల్ ఆర్‌'కు షాకిచ్చిన ఏపీ హైకోర్టు

raghurama krishnaraju
వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్)కు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరుతో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపించి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. 
 
ఇందుకోసం ఏపీ మద్యం చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన సవరణల చట్టాన్ని రద్దు చేయాలని తన పిటిషన్‌లో కోరారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి, వ్యాజ్యాన్ని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రఘురామరాజు చేతికి రాలేదు. దీంతో ఈ పిటిషన్‌ను ఏ కారణంతో కొట్టివేసిందో తెలియడం లేదు.