వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో చుక్కెదురు
ఏపీలోని అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్టులో మరోమారు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు మరోమారు డిస్మిస్ చేసింది.
కాకినాడకు చెందిన తన వ్యక్తిగత కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రదాన నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఆయన కొద్దిరోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు... పోలీసులు 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయనందున బెయిల్ ఇవ్వాలని విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
నిర్ణీత సమయంలోనే ఛార్జిషీట్ దాఖలు చేశామని.. సాంకేతిక కారణాలతో తిప్పిపంపారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం అనంతబాబు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.