1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (16:32 IST)

మాజీ సీఎం రోశయ్య మృతిపై స‌మాచార మంత్రి పేర్ని నాని సంతాపం

ఏ పదవి చేపట్టినా ఆ పదవికే రోశయ్య వన్నెతెచ్చారని, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక ఆయ‌న అని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య సంతాపం ప్రకటించారు. 
 
 
శనివారం మంత్రి పేర్ని నాని తన కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని పేర్ని నాని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా.. ఇలా ఏ పదవి చేపట్టినా ఆ పదవికే రోశయ్య వన్నెతెచ్చారన్నారు.


సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, మంచి వక్తగా పేరు గడించారని అన్నారు. పదహారు సార్లు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అపర రాజకీయ జ్ఞాని రోశయ్య అని తెలిపారు.  కొణజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారని  గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ అభ్యసించారన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారని తెలియచేసారు.  తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా ఎంతో సమర్ధవంతంగా  పనిచేశారన్నారు. 
       
 
రోశయ్య 2004లో ప్రకాశం జిల్లా చీరాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారని  2009 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం రోశయ్యకు  ఉందని చెప్పారు. రోశయ్య 2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారన్నారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారన్నారు.  2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారని మంత్రి పేర్ని నాని గుర్తు చేసుకొన్నారు. రోశయ్యకు ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉందన్నారు. రోశయ్య ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ పై  ఆయన చేసే అమూల్య  ప్రసంగాలను తాను మచిలీపట్నం శాసనసభ్యునిగా విని ఎంతో ప్రేరణ పొందే అవకాశం దక్కిందన్నారు. 
 
 
దివంగత ముఖ్యమంత్రి  వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోశయ్య ఆర్థిక మంత్రిగా పని చేశారన్నారు. అప్పట్లో వైఎస్‌ఆర్‌ ప్రజల వద్దకు వెళితే ఎలాంటి హామీలు ఇస్తారోనని రోశయ్య గుబులు చెందేవారని, అదే సమయంలో వైఎస్సార్  ఏ హామీలు ఇచ్చినా ఆర్థిక మంత్రిగా రోశయ్య తన మేధస్సును ఉపయోగించి అన్నీ నెరవేర్చేవరన్నారు. అలాంటి వ్యక్తి మరణం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు.