మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (16:46 IST)

తెలుగు రాష్ట్రాల మధ్య జలయుద్ధం.. తాడోపేడో తేల్చుకుంటామంటున్న అనిల్

రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింతగా ముదిరేలా కనిపిస్తున్నాయి. నీటి ప్రాజెక్టుల విషయంలో ఏ ఒక్క ప్రభుత్వం వెనక్కి తగడం లేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తున్నాయి. 
 
తాజాగా ఈ అంశంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, భవిష్యత్తులోనూ ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా? అని ప్రశ్నించారు. 
 
మీరు చేస్తే తప్పు లేదు... మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా? అంటూ అనిల్ నిలదీశారు. ఏపీలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం లేదని స్పష్టం చేశారు. కృష్ణా నది నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అని వివరణ ఇచ్చారు. 
 
చట్టానికి లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాను ఎక్కడా అతిక్రమించలేదని పేర్కొన్నారు. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునే వీలుంటుందని వివరించారు. శ్రీశైలంలో 848 అడుగులుంటే చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటే పొందగలిగే పరిస్థితి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్టు ఏర్పాటు తప్పు ఎలా అవుతుందో తెలంగాణ చెప్పాలని నిలదీశారు. కృష్ణా నది నుంచి తాము చుక్క నీరు కూడా ఎక్కువగా తీసుకోవడంలేదని ఉద్ఘాటించారు. 
 
అయితే, తెలంగాణ 6 టీఎంసీల ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని మంత్రి అనిల్ ఆరోపించారు. శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులు ఉన్నా సరే, లిఫ్టు చేసేలా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని వివరించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారని  తెలిపారు.