మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (11:09 IST)

యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్ : కాళోజీ విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం వరంగల్‌, యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం పర్యటించనున్నారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానానికి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం చేరుకుంటారు. 
 
అనంతరం సెంట్రల్‌ జైలు కూల్చివేసిన ప్రదేశానికి వెళ్తారు. 30 అంతస్థుల్లో నిర్మించే మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.35 గంటలకు కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో నిర్మించిన కాళోజీ హెల్త్‌ వర్సిటీ భవనానికి ప్రారంభోత్సవం చేస్తారు. 
 
ఆ తర్వాత హన్మకొండ సుబేదారి ప్రాంతంలో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్నీ ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 
 
ఈ జిల్లా పర్యటన ముగించుకుని సీఎం కేసీఆర్‌ తిరుగు ప్రయాణంలో సాయంత్రం నాలుగు గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. 
 
పెద్దగుట్టపై టెంపుల్‌సిటీ లేఅవుట్‌, గండిచెరువు వద్ద నిర్మాణాలు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను పరిశీలిస్తారు. ప్రధానాలయ ప్రాకార గోపుర సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను వీక్షిస్తారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళతారు. 
 
సీఎం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు.. మంగళవారం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పర్యటించనున్న సందర్భంగా సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి ప్రియాంకవర్గీస్‌ ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు.
 
ఇదిలావుంటే, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖశిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌చే రూపుదిద్దుకున్న పద్మవిభూషణ్‌, ప్రజాకవి కాళోజీ నారాయణరావు విగ్రహాన్ని ఆదివారం కొత్తపేట నుంచి వరంగల్‌కు తరలించారు. 
 
సోమవారం వరంగల్‌లో ప్రజాకవి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ చేతులమీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని వడయార్‌ తెలిపారు. 
 
గతంలో కాకతీయ విశ్వవిద్యాలయంలో రాణి రుద్రమదేవి, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాలను రూపకల్పన చేశామన్నారు. ఇప్పుడు కాళోజీ విగ్రహాన్ని తమ చేతులమీదుగా రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందంటూ తెలంగాణ సర్కారుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.