శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (11:30 IST)

నేటి నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల టూర్ - ముందస్తు అరెస్టులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు.  ఈ జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవనాలతోపాటు పోలీసు కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు. 
 
ఆదివారం ఉదయం 11 గంటలకు సిద్దిపేటకు చేరుకొని జిల్లా కలెక్టరేట్‌తోపాటు పోలీసు కమిషనరేట్‌ను, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని సైతం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి సమీకృత కలెక్టరేట్‌తోపాటు ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 
 
ఆయా జిల్లాల్లోని గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశం ఉన్నది. సోమవారం వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కాళోజీ యూనివర్సిటీ, వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్లను ప్రారంభిస్తారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజచేయనున్నారు. 
 
22వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి వెళ్లన్నారు. గ్రామ ప్రజలతో సమస్యలపై చర్చించి, వారితో సహపంక్తి భోజనం చేయనున్నారు.
 
ప్రభుత్వ కార్యాలయానికి పనిమీద వచ్చిన ప్రజలు ఒక్కో విభాగం అధికారి కోసం జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలకు రోజంతా తిరగాల్సిన అవసరం లేకుండా జిల్లాస్థాయి అధికారుల కార్యాలయాలన్నీంటిని ఒకేచోట ఉండేలా సమీకృత భవనాలను ప్రభుత్వం నిర్మించింది. 
 
పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేశారు. దీంతో మారుమూల చివరిగ్రామం నుంచి కూడా గంటలో జిల్లా కేంద్రానికి చేరుకొనే అవకాశం ఏర్పడింది. 
 
గతంలో జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఒక దినమంతా పట్టేది. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాలతో మారుమూల నుంచి పనిపై కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చే వ్యక్తి ఒక్కపూటలో అన్నిశాఖల అధికారులను కలిసి పని పూర్తిచేసుకొని ఇంటికి చేరుకొనే అవకాశం ఏర్పడింది.