శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జులై 2019 (16:16 IST)

ప్రజాధనం పప్పుబెల్లాల్లా పంచిపెట్టారు : మంత్రి పెద్దిరెడ్డి

దోచిన ప్రతి రూపాయి వెనక్కి తెస్తాం విజిలెన్స్‌ రిపోర్ట్‌ వచ్చాక ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ నీరు-చెట్టుకు రూ.161.29కోట్లు కేటాయింపులు చేస్తే.. మొత్తంగా రూ.4,850.23 కోట్లు ఖర్చు చేశారని, రూ.1,183 కోట్లు నీరు చెట్టు కింద పెండింగ్‌ బిల్లులు ఉన్నాయన్నారు. 
 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.8.95 కోట్ల విలువైన 16795 వర్కులు క్యాన్సిల్‌ చేయటం జరిగిందని పెద్దిరెడ్డి తెలిపారు. ఏదైతే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసి.. తిరిగి నీరుచెట్టు పథకం కింద బిల్లులు చేసుకున్నారో వాటి మీద విచారణ చేసి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌కు ఇచ్చి రెవిన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం రాబడతామని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఉపాధి హామీ పనులు ఎక్కడున్నాయో తెలీదని, వేసిన కట్టకే మట్టి వేస్తారని, తవ్విన గుంతే మళ్ళీ తవ్వుతారని వీటికి ఈ నీరుచెట్టు అనుసంధానమని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. 
 
గత నాలుగేళ్లుగా చంద్రబాబు ఈ పథకాన్ని తెలుగుదేశం తమ్ముళ్లకు ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచిపెట్టడానికి వాడుకున్నారని అన్నారు. ఉపాధి హామీ పనులకే నీరుచెట్టు పేరుతో బిల్లులు చేసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. తప్పకుండా దీని మీద సమగ్ర విచారణ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా చేయటం జరుగుతుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 
 
దీనిపై సభ్యులు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయటంతో దీనిపై సబ్‌కమిటీ అవసరం లేదని ఈ విషయాన్ని నేరుగా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు ఇస్తున్నామని సమగ్రంగా వారు విచారణ చేసి రిపోర్ట్‌ ఇచ్చిన తర్వాత దీనిమీద ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారని పెద్దిరెడ్డి తెలిపారు. రెవిన్యూ ఆర్‌ఆర్‌ యాక్ట్‌ కింద డబ్బులు భోంచేసిన వారి నుంచి వసూలు చేస్తామని అన్నారు.  రికార్డుల్లో పెద్దఎత్తున పనులు చేశామని చూపించారని, నిజంగా  చేసి ఉంటే రాష్ట్రంలో చెరువులు అన్నీ ఈపాటికే బాగుపడి ఉండేవని పెద్దిరెడ్డి తెలిపారు