కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ కుమార్ పై మండిపడ్డ వాసిరెడ్డి పద్మ
' రేప్ ఎంజాయ్' వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. శుక్రవారం ఆమె కమిషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యే 'అత్యాచారం నుంచి తప్పించుకోలేనప్పుడు..' అనే వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడటాన్ని ఖండించారు. జాతీయ స్థాయిలో దుమారం రేగిన తర్వాత ఆయన అసెంబ్లీ వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ, సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకుంటుందన్నారు. మహిళా ద్వేషి, మహిళల పట్ల విద్వేషపూరిత మనస్తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండటం విచారకరమన్నారు.
రమేష్‌కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదని, గతంలో ఆయన స్పీకర్‌గా ఉన్న సమయంలోనూ దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అన్నారు. గౌరవ మర్యాదలతో నడవాల్సిన చట్టసభలు పాత చింతకాయ పచ్చడి సామెతలు, అభిప్రాయాలతో ముందుకు సాగలేవన్నారు. ప్రజాప్రతినిధులందరికీ తలవంపులు తెచ్చిన రమేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలను సర్వత్రా ఖండించాలన్నారు. అసెంబ్లీలో అప్రస్తుత చర్చకు తావిస్తూ, మహిళల పట్ల ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయని జనాల్లోకి వ్యాప్తిచేయడం ఎంతవరకు సబబని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులు మహిళల పట్ల తమ భావాజాలాలను మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలకు సంబంధించిన అనేక సున్నితమైన అంశాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సాక్షాత్తూ సుప్రీంకోర్టు కూడా దుస్తులపైన తాకినా దాన్ని రేప్ కేసు కింద పరిగణించాల్సి వస్తుందని తీర్పులిస్తున్న తరుణంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. మహిళల అభివృద్ధి వైపుగా ఆలోచన చేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. బూజుపట్టిన అభిప్రాయాలను నేతలు తమ బుర్రల్లో నుంచి తొలగించుకున్నప్పుడే మహిళా సాధికారత, వారికి సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందని వాసిరెడ్డి పద్మ స్పందించారు.