పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ!
ఏపీ పర్యాటకశాఖ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు కుమారుడు జన్మించాడు. ఆమెకు పండంటి మగ బిడ్డ జన్మించడంతో భూమా వారి ఇంట సంతోషం నెలకొంది. అతి చిన్న వయసులో మంత్రి పదవి పొందిన భూమా అఖిల ప్రియ, ఆ హోదాలో ఉండగానే, భార్గవ్ రామ్ నాయుడుతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ ఒకటవ్వాలని నిర్ణయించుకుని, పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం చేసుకున్నారు. అప్పట్లో వారి వివాహానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని సూచనలు చేశారని చెపుతారు.
ఎట్టకేలకు ఆగస్టు 29, 2018న భూమా అఖిల ప్రియ వివాహం భార్గవ్ రామ్‌తో జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని కోటకందుకూరు మెట్టు వద్ద ఉన్న భూమా శోభానాగిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. అంతకు ముందుకు హైదరాబాదులోని కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. అలాగే అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
మే 12, 2018న భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్‌ల ఎంగేజ్ మెంట్ హైదాబాదులో జరిగింది. అనంతరం ఘనంగా ఆమె మ్యారేజ్ ఆళ్ళగడ్డలో ఆగస్టు 29న జరగడం, తర్వాత హైదరాబాదులో రిసెప్షన్ నిర్వహించారు. దీనికి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, ఇతర మంత్రి వర్గ సహచరులు, చిరంజీవి వంటి సినీ తారలు హాజరై భూమా అఖిల ప్రియ, భార్గవ్ రామ్ దంపతులను ఆశీర్వదించారు.
ఆ తర్వాత భార్గవ్ రామ్ తన భార్య భూమా అఖిలప్రియ సొంత నియోజకవర్గం ఆళ్లగడ్డలో రాజకీయాల్లో తలదూర్చడం, ఎన్నికల సమయంలో వివాదాస్పదం కావడం జరిగింది. భూమా నాగిరెడ్డి అనుంగ అనుచరుడు ఎ.వి.సుబ్బారెడ్డితో అఖిల ప్రియకు వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఒక దశలో ఆమె వైఎస్ఆర్ సిపి లోకి వెళుతున్నారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. కానీ, అఖిల ప్రియ, చంద్రబాబు నాయుడుతోనే ఉండి, పార్టీ టిక్కెట్ సాధించినా, ఆళ్ళగడ్డలో ఓటమిని చవిచూశారు. అనంతరం అనేక వివాదాలతో అఖిల ప్రియ కర్నూలు పోలీసులకు టార్గెట్ కూడా అయ్యారు. ఇక, హైదరాబాదులో ఆస్తుల వివాదంలో అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసులు కూడా నమోదయ్యాయి. ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అప్పటికే ఆమె గర్భవతి కావడం, అనంతరం ఇపుడు మగ బిడ్డకు జన్మనివ్వడంతో భూమా కుటుంబంలో సంతోషాలు నెలకొన్నాయి.