బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2021 (10:03 IST)

మే మొదటివారం వరకు శుభకార్యాలు లేనట్లే!

మే మొదటివారం వరకు ఎటువంటి శుభ ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా శుభకార్యాలు నిలిచిపోతే.. ఈ సారీ వరుస మౌఢ్యాలు అడ్డుతగులుతున్నాయి. ఈ సారి శుక్ర మౌఢ్యం దాదాపు మూడు నెలలకుపైగా ఉంది. దీంతో ఈ మౌఢ్యం ముగిసే వరకు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు స్పష్టం చేస్తున్నారు.

దీంతో ఈ ఏడాది ప్రథమార్థంలో సన్నాయి మోతలు వినిపించవన్నమాట. ఎప్పుడూ ఏడాదిలో ఒక నెల మాత్రమే ఈ మౌఢ్యం ఉంటుంది. ఇంత సుదీర్ఘ మౌఢ్యం నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. మధ్యలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో మాఘమాసం ఆరంభం కాబట్టి అరకొర ముహూర్తాలు ఉన్నాయి. ఆ తరువాత మే మొదటివారం వరకు ఎటువంటి మంచి ముహూర్తాలు లేవు.

శుక్ర మౌఢ్యంలో కూడా కొన్ని రకాల శుభకార్యాలు చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. నవగ్రహ శాంతులు, రుధ్రాభిషేకాలు, హోమాలు, శాంతి పూజలు, శ్లాబులు వేసుకోవడం, ఇంటి మరమ్మతులు, పెళ్ళి చూపులు, సీమంతం, భారసాల, అన్నప్రాశన తదితర కార్యక్రమాలు చేసుకోవచ్చు. గృహ ప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు, ఆలయ ప్రతిష్ఠలు, శంకుస్థాపనలు, బోర్లు వేయడం, నూతన వాహనాల కోనుగోలు తదితరాలు మౌఢ్యంలో చేయకూడదు.
 
శుఖ్ర మౌఢ్యం అంటే..
సూర్యుడిలో గ్రహాల కలయిక జరిగినప్పుడు వాటి మౌఢ్యాలు ఏర్పడతాయి. సూర్యుడు, గురు గృహాల కలయికతో జనవరి 16 నుంచి గురుమౌఢ్యం ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10 గంటలకు ముగుస్తుంది. శూన్య మాసం, పైగా గురు మౌఢ్యం కావడంతో ఈ రోజుల్లో శుభకార్యాలు ఎవరూ నిర్వహించరు. అ తరువాత సూర్యుడిలో శుక్ర గ్రహ కలయికతో ఫిబ్రవరి 15 నుంచి శుక్ర మౌఢ్యం ప్రారంభమై మే 4 ఉదయం 7 గంటల వరకు కొనసాగుతుంది. 
 
మాఘ మాసంలోనే మౌఢ్యం
మంచి ముహూర్తాలు ఎక్కువగా ఉండే మాఘమాసంలోనే ఈసారి మౌఢ్యం వచ్చింది. దాదాపు 104 రోజుల పాటు ముహూర్తాలు లేకపోవడం అరుదుగా జరుగుతుంది. పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఈసారి మౌఢ్యం శరాఘాతంలా మారింది.