సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (19:53 IST)

ఒంటిమిట్టకు సతీసమేతంగా వెళ్లాల్సి వస్తుందనే జగన్ కుంటిసాకు : అచ్చెన్నాయుడు

atchennaidu
కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలో జరిగిన సీతారామ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా హాజరుకావాల్సివుంది. కానీ, కాలు బెణికుందని పేర్కొంటూ ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. పైపెచ్చు. గురువారం పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, లింగంగుంట్లలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి సీఎం జగన్ హాయిగా పాల్గొన్నారు. దీన్ని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఒంటిమిట్టకు వెళ్లకుండా జగన్ కుంటిసాకులు చెప్పారని ఆరోపించారు. 
 
సీఎం జగన్ కాలు బెణికింది అనేది ఓ సాకు మాత్రమేనని స్పష్టంచేశారు. సతీసమేతంగా వెళ్లాలి కాబట్టే జగన్ ఒంటిమిట్టకు వెళ్లలేదని అచ్చెన్న విమర్శించారు. గురువారం పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో జగన్ చక్కగా పాల్గొన్నారని, ఒంటిమిట్ట కళ్యాణం అంటేనే సీఎంకు కాలునొప్పి వచ్చిందా అని నిలదీశారు. ఇటీవల వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతోనే జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలు బెణికిందంటూ ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి వెళ్లకుండా చిలకలూరిపేటకు ఎలా వెళతారని ఆయన నిలదీశారు.