గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:38 IST)

20న విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ మేధోమదన రౌండ్ టేబుల్ సమావేశం

సామాజిక న్యాయమే లక్ష్యంగా రాజకీయ పార్టీ నిర్మాణ సన్నాహక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ మేధోమదన రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 20న విశాఖపట్టణంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు.

రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంప్రసాద్, జస్టిస్ బాలయోగి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ప్రొపెసర్ సాయన్న హాజరవుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా బీసీ, ఎస్సీఎస్టీ, మైనార్టీలు ఉన్నా కేవలం 10% కూడా లేని రెండు సామాజిక వర్గాల పార్టీలే రాజ్యాధికారాన్ని చెలాయిస్తున్నాయన్నారు.

బహుజనులకు ఏవో కొన్ని ఆర్థిక రాయితీలు, సంక్షేమ పథకాల పేరుతో విధిలిస్తూ రాష్ట్రంలోని సంపద, సహజ వనరుల్ని దోచేస్తున్నాయని ఆరోపించారు. వీటితో ఓట్లను కొని ప్రజాస్వామ్యాన్ని ధన స్వామ్యంగా మార్చేస్తున్నారని విమర్శించారు. ఈ పార్టీలు బహుజనులకు కొన్ని పదవులు, రాయితీలు కల్పించి రాజకీయ బానిసలుగా మార్చుకుంటున్నాయని తెలిపారు.

బహుజన నాయకులు తమ ఆర్ధిక, స్వంత ప్రయోజనాలు చూసుకుంటున్నారే తప్ప అణిచివేతకు గురవుతున్నా తమ జాతుల ప్రయోజనాలు గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యాధికార సాధనే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఇందులో భాగంగా గతంలో విజయవాడలో రాజకీయ మేదోమధన సదస్సు, గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సమైక్యంగా రాజకీయ పార్టీని నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు.

అందులో భాగంగా నవంబరు 29న తిరుపతిలో రాజకీయ మేదోమదన సదస్సు నిర్వహించామని, ఈ నెల 20న విశాఖపట్టణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి బహుజనులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
 
సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.ఎమ్.వి. నాగలింగం, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు కాకు మల్లిఖార్జున యదవ్, విజయవాడ సిటీ కార్యదర్శి మహాంతి వాసుదేవరావు, గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాథ్, రాష్ట్ర నాయకులు మేకా వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు కె. వేణు, మహంతి రామ్ ప్రసాద్, కత్తుల మణికంఠ, జెఏసీ అధికార ప్రతినిధి పి. రాంబాబు, ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు.