1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (16:56 IST)

ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానంలో నేను పోటీ చేయను... అఖిల ప్రియా రెడ్డి

భూమా నాగిరెడ్డి - శోభానాగిరెడ్డి దంపతుల పెద్ద కుమర్తెగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భూమా అఖిల ప్రియా రెడ్డి బాగా రాటుదేలిపోయారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పని చేస్తున్న ఆమె... ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తూ, తమ వర్గనికి చెందిన కార్యకర్తల్లో ఫుల్‌జోష్ నింపుతున్నారు. అంతేకాకుండా, స్థానికంగా టీడీపీ నేతలతో ఏర్పడిన విభేదాలతో తనకు ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని కూడా తిరస్కరించారు. 
 
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించిన పసుపుకుంకుమ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆళ్ళగడ్డలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. కానీ, తన రూపంలో తన తల్లి శోభానాగిరెడ్డి పోటీ చేస్తుందని వెల్లడించారు. అందువల్ల భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 
 
గత ఎన్నికలకు ముందు శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించినా... ఆమెకే ఓట్లు వేసి గెలిపించారని, ప్రపంచంలో ఓ మరణించిన నేతకు ఇలా ఓట్లు వేసి గెలిపించిన చరిత్ర లేదని అఖిల ప్రియ గుర్తు చేశారు. ఆ ఘనత ఆళ్లగడ్డ ప్రజలకే దక్కుతుందన్నారు. ఇక, రాబోయే ఎన్నికల్లోనూ అమ్మ శోభనాగిరెడ్డిలా భావించి.. తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 'నాకు ఓటు వేసినట్టుగా కాదు. అమ్మ శోభానాగి రెడ్డికి ఓటువేస్తున్నామని భావించి ఓటేయండి. పోటీలో ఉన్నది నేను కాదు, శోభానాగిరెడ్డేనని భావించండి' అని ఆమె కోరారు. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అఖిల ప్రియా రెడ్డి అమ్మ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు.