శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 21 మే 2019 (13:12 IST)

అమ్మతోడు.. ఆంధ్రాలో ఒక్క సీటు రాదంటున్న బీజేపీ నేత

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీ బుధవారం వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభానేత విష్ణుకుమార్ రాజు స్పందిస్తూ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నమ్మలేమన్నారు. కానీ, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా కాషాయం జెండా రెపరెపలు కనిపించినప్పటికీ.. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. కానీ, అసెంబ్లీ ఎన్నిక్లలో మాత్రం మూడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందన్నారు.
 
'నేను విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేశాను. అక్కడ టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఖచ్చితంగా ఓడిపోతారు. అయితే వైసీపీ అభ్యర్థి.. లేదంటే నేను గెలుస్తాం' అని వ్యాఖ్యానించారు. 
 
23వ తేదీన వెలువడే ఫలితాలతో అందరికీ అర్థమవుతుందన్నారు. మోడీ వ్యతిరేక పవనాలు తీసుకురావడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నించినప్పటికీ వారి ఆటలు సాగలేదని, ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
ఇకపోతే, బీజేపీకి సొంతగా 280కి పైగా సీట్లు వస్తాయన్నారు. విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చి కొంత మంది అందరినీ కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఆ ప్రయత్నాలు వృథా అవుతాయి కాబట్టి అలాంటివి చేయవద్దని సూచించారు. 
 
జాతీయ స్థాయిలో బీజేపీ శాస్త్రీయంగా సర్వే చేయించిందని, అందులో తక్కువలో తక్కువ 280 సీట్లు వస్తున్నాయని తేలిందన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొంతమేరకు నష్టం జరిగినప్పటికీ ఆ రాష్ట్రంలో కూడా కనీసం 60 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.