ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (15:15 IST)

నూటికి వెయ్యి శాతం మేమే గెలుస్తున్నాం: చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. తాను ఇచ్చిన పిలుపు మేరకు తరలి వచ్చిన ఓటర్లు సైకిల్ గుర్తుకు ఓటు వేశారనీ ఈ కారణంగానే టీడీపీ గెలుస్తుందని చెప్పారు. 
 
ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, 'నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను. అదే సమయంలో టెక్నాలజీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీకి మనం మాస్టర్ కావాలే తప్ప దానికి బానిసైపోకూడదు. అందుకే దేశంలోని తొలిసారి సైబర్ సెక్యూరిటీ వింగ్‌ను ఏపీలో ఏర్పాటుచేశాం. నేరాలన్నింటిని కంట్రోల్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చారు. 
 
'ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న ఉద్దేశంతో పేపర్ బ్యాలెట్‌కు పోవాలని మేం డిమాండ్ చేశాం. కానీ ఈసీ మాత్రం మధ్యేమార్గంగా వీవీప్యాట్‌లను ఎంచుకుంది. వీవీప్యాట్ ఒరిజనల్ ఐడియా ఏంటంటే ఓటు వేశాక ఎవరికి ఓటు పడిందో తెలుసుకునే స్లిప్పు ఓటర్ చేతిలోకి రావాలి. అనంతరం దాన్ని సదరు ఓటర్ బ్యాలెట్ బాక్సులో వేయాలి. కానీ ఇప్పుడు ఓటు ఎవరికి వేశామో తెలీదు, ఎవరికి పడిందో తెలీదు. ఏడు సెకండ్లు ఉండాల్సిన వీవీప్యాట్ స్లిప్పు కేవలం మూడు సెకన్లలోపే బాక్సులో పడిపోయింది' అని వ్యాఖ్యానించారు. 
 
ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పును ఓటర్ సరిచూసుకుని బ్యాలెట్ బాక్సులో వేసేలా విధానం తీసుకురావాలని తాము కోరుతున్నామనీ, ఇందులో అభ్యంతరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు.
 
ఇకపోతే, నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలుపు ఖాయమన్నారు. టీడీపీని గెలిపించేందుకు ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన వేలాది మంది వచ్చారన్నారు. తాను ఓటెయ్యమని పిలుపునిస్తే లక్షలాది మంది తరలి వచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌, ఈవీఎంలపై మరోసారి విమర్శలు గుప్పించిన చంద్రబాబు తన పోరాటంతోనే వీవీ ప్యాట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీవీ ప్యాట్ల ద్వారా వచ్చే స్లిప్పులను బాక్స్‌లో వేసేలా ఈసీ చర్యలు చేపట్టాలని బాబు డిమాండ్ చేశారు.